Tejashwi Yadav: నీతీశ్‌ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ సోషలిస్ట్‌ ఫ్యామిలీ (మహాకూటమి)లో చేరాలని సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’ లాంటిదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి.....

Published : 13 Aug 2022 01:26 IST

ప్రాంతీయ పార్టీల ముగింపే భాజపా లక్ష్యమన్న తేజస్వి యాదవ్‌

దిల్లీ: బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ సోషలిస్ట్‌ ఫ్యామిలీ (మహాకూటమి)లో చేరాలని సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’ లాంటిదని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ అన్నారు. బీసీ, దళిత రాజకీయాలకు ముగింపు పలికే లక్ష్యంతో భాజపా పనిచేస్తోందని విమర్శించిన ఆయన.. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను బెదిరించడం వంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. బిహార్‌ (Bihar Politics) ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయిన తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav).. మీడియాతో మాట్లాడారు.

‘మతపరమైన శక్తులకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం, పేద ప్రజల కోసమే మా నాన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జీవితం మొత్తం పోరాటం చేశారు. ఆర్జేడీ కూటమిలో చేరాలనే నిర్ణయంతో నీతీశ్‌ కుమార్‌ తన సిద్ధాంతాన్ని రక్షించుకున్నారు. మేం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నప్పటికీ మాదంతా ఒకే కుటుంబం. మేమందరం సోషలిస్టులం. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా బీసీ, దళితులకు చెందినవని. నీతీశ్‌ కుమార్‌ కూడా వెనుకబడిన వర్గానికి చెందిన వారే. రాంవిలాస్‌ పాశ్వాన్‌ పార్టీని కూడా భాజపా చీల్చింది. ప్రాంతీయ పార్టీలు లేకుంటే దేశంలో ప్రతిపక్షం లేనట్లే. అది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. అటువంటి పాలనను భాజపా కోరుకుంటోంది’ అని తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) ఆరోపించారు.

‘బిహార్‌లో భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఒకేచోట ఉన్నాయి. నీతీశ్‌ కుమార్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే జరుగుతుంది’ అని తేజస్వి యాదవ్‌ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి నీతీశ్‌ కుమారేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ప్రతి ఏడాది 2కోట్ల ఉద్యోగాలు భాజపా చేసిన వాగ్దానం ఏమయ్యిందంటూ ఎదురు ప్రశ్నించారు. ఉద్యోగాలపై మీడియాలో వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. కనీసం ఇప్పుడైనా మతపరమైన రాజకీయాలను పక్కనబెట్టి వాస్తవ సమస్యలపై మాట్లాడుతున్నారని అన్నారు. మేం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌.. ఇందుకు కొంత సమయం వేచిచూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని