Bihar: రెండువారాల తర్వాత నీతీశ్‌ బలపరీక్ష.. ఆలస్యానికి కారణం ఏంటంటే..?

బిహార్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి గద్దెనెక్కారు నీతీశ్‌కుమార్. ఈక్రమంలో బలపరీక్ష నిర్వహించేందుకు రెండువారాల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆలస్యం వెనుక ఓ కారణముంది. 

Published : 12 Aug 2022 01:51 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి గద్దెనెక్కారు నీతీశ్‌కుమార్. ఈక్రమంలో బలపరీక్ష నిర్వహించేందుకు రెండువారాల తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆలస్యం వెనుక ఓ కారణముంది. 

ప్రస్తుతం బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌గా భాజపాకు చెందిన విజయ్ కుమార్ శర్మ ఉన్నారు. ముందు ఆయన్ను మార్చాలని కొత్త కూటమి(జేడీయూ, ఆర్జేడీ) భావిస్తోంది. బలపరీక్ష వేళ.. తమ కూటమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకోవడం ఒక కారణమైతే, ఆర్జేడీ నుంచి స్పీకర్‌ను ఎంచుకోవాలని కొత్త పొత్తు సమయంలో నిర్ణయమైంది. ఇప్పటికే కూటమికి చెందిన 55 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నిబంధల ప్రకారం ఆ తీర్మానం సమర్పించిన రెండువారాల తర్వాత దానిపై చర్చ జరపాలి. అంటే కొత్త ప్రభుత్వం బలపరీక్ష కోసం ఎంతలేదన్నా ఆగస్టు 24 వరకు వేచిఉండాలి. అయితే భాజపా నాయకత్వం ఆదేశాల మేరకు స్పీకర్‌ ఈ లోపే రాజీనామా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త కూటమి బలం 164గా ఉంది. మెజార్టీ మార్కు(122) కంటే ఇది చాలా ఎక్కువే.

అది పెద్ద జోక్‌: నీతీశ్‌

నీతీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిని చేయకపోవడం వల్లే భాజపా, జేడీయూ బంధం తెగిపోయిందని కమలం పార్టీ నేత సుశీల్‌ కుమార్ మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని నీతీశ్ తోసిపుచ్చారు. ‘అదో పెద్ద జోక్‌. నాకు అలాంటి కోరికేం లేదు. వారు నిలబెట్టిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు మేం ఇచ్చిన మద్దతును వారు మర్చిపోయారా..? ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత సమావేశాలు నిర్వహించాం’ అని సుశీల్ వ్యాఖ్యలను కొట్టివేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని