Sonia-Lalu, Nitish: సోనియాతో లాలూ, నీతీశ్‌ల భేటీ.. ఏం చర్చించారంటే..!

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ-యూ నేత నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు భేటీ అయ్యారు.

Published : 25 Sep 2022 20:54 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ-యూ నేత నీతీశ్‌ కుమార్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు (Lalu Prasad Yadav) భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం దిల్లీలోని సోనియా నివాసానికి చేరుకున్న ఇరువురు నేతలు.. విపక్షాల ఐక్యతపై చర్చించారు. ఐతే, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత వీటిపై మరోసారి చర్చిద్దామని ఇద్దరు నేతలకు సోనియా చెప్పినట్లు సమాచారం.

‘2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు విపక్షాల ఐక్యతపై సోనియా గాంధీతో చర్చించాం. పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత మళ్లీ సమావేశమవుదామని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌ లేకుండా విపక్షాల కూటమి అనే ప్రసక్తేలేదు. భాజపాను ఎదుర్కోవడంలో ఆ పార్టీ ముందుంది’ అని  సోనియాతో భేటీ వివరాలను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెల్లడించారు.

బిహార్‌లో భాజపాతో తెగతెంపులు చేసుకున్న తర్వాత నీతీశ్‌ కుమార్‌ సోనియాతో భేటీ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు, గడిచిన ఆరు సంవత్సరాల్లో ఈ మూడు పార్టీల నేతలు సమావేశమవడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక విపక్షాలను ఒకే కూటమి కిందకు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (INLD) వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్‌ జయంతి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఎం నేత ఏచూరి, శివసేన, ఇతరపార్టీల నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని