Nitish Kumar: ‘నీతీశ్‌ ఎక్కడికీ వెళ్లరు’.. ఊహాగానాలపై జేడీయూ క్లారిటీ

బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఎక్కడికీ వెళ్లబోరని, ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జేడీయూ వర్గాలు స్పష్టంచేశాయి.

Published : 01 Apr 2022 13:52 IST

పట్నా: బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఎక్కడికీ వెళ్లబోరని, ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జేడీయూ వర్గాలు స్పష్టంచేశాయి. నీతీశ్‌ చేసిన ‘రాజ్యసభ’ వ్యాఖ్యలపై వివిధ రకాల ఊహాగానాలు వస్తోన్న వేళ పలువురు జేడీయూ నేతలు దీనిపై స్పందించారు. అటువంటి ప్రచారం ఉత్తిదేనని పేర్కొన్నారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపాకే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ ముందస్తు ఒప్పందం మేరకు జేడీయూ నేత అయిన నీతీశ్‌ కుమార్‌కు సీఎం పీఠం అప్పగించారు. అయితే, ఇటీవల కొందరు భాజపా నేతలు సీఎం పదవి గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇటీవల విలేకరుల సమావేశంలో నీతీశ్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యసభకు వెళ్లేందుకు నేను వెనకాడబోను. ప్రస్తుతానికైతే సీఎంగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. కానీ ఏం జరుగుతుందో చెప్పలేను’’ అని అనడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్రంలో భాజపా ఏవైనా కీలక బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు తాను సిద్ధమేనని సంకేతాలిచ్చేందుకే నీతీశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు జరగనుండడమూ ఇందుకు నేపథ్యం.

నీతీశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై జోరుగా ప్రచారం మొదలైంది. సీఎం పదవిని వదిలేస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో జేడీయూ నేతలు స్పందించారు. ఐదేళ్ల పాటు నీతీశ్‌ కుమార్‌ పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ నేత ఉపేంద్ర కుష్వాహా అన్నారు. నీతీశ్‌ రాజ్యసభకు వెళతారంటూ జరుగుతోన్న ప్రచారం సత్యదూరమని మరో నేత సంజయ్‌ కుమార్‌ ఝా పేర్కొన్నారు. ఆయన ఎక్కడికీ వెళ్లరని, ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతారని ట్విటర్‌లో స్పష్టం చేశారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు