కాంగ్రెస్‌ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కష్టమే: సంజయ్‌ రౌత్‌

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Published : 31 Oct 2021 01:49 IST

పుణె: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. కాంగ్రెస్‌ లేకుండా ఏ ఒక్క పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అభిప్రాయపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌ వేళ్లూనుకుందని, మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలని పేర్కొన్నారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు.

కొన్ని దశాబ్దాల పాటు భాజపా అధికారంలో ఉండబోతోందంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలపై  ఈ సందర్భంగా సంజయ్‌ రౌత్‌ స్పందించారు. దేశ రాజకీయాల్లో భాజపా ఉంటుందని గానీ, అధికారంలో మాత్రం కాదని రౌత్‌ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా తమను తాము చెప్పుకొనే భాజపా.. ఎన్నికల్లో ఓడిపోతే ప్రతిపక్షంలోనే ఉండాలని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రనే అందుకు ఉదాహరణ అని చెప్పారు.

ప్రస్తుతానికి తాము దాద్రానగర్‌ హవేలీ, గోవా ఎన్నికలపై దృష్టి సారించామని రౌత్‌ తెలిపారు. యూపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. అక్కడ తమ పాత్ర పరిమితమే అయినా పోటీ చేసి తీరుతామని స్పష్టంచేశారు. రెండేళ్లుగా కరోనా పేరు చెప్పి తమ మంత్రులను కేంద్రం మీడియాకు దూరంగా ఉంచుతోందని, వారిపై నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలోనూ మీడియాను ఈ స్థాయిలో అడ్డుకోలేదన్నారు. అనుకూలంగా లేని మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రౌత్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని