Naveen Patnaik: రూటు మార్చిన నవీన్‌ పట్నాయక్‌.. రాజ్యసభలో రివర్స్‌ గేర్‌

ఇన్నాళ్లు భాజపాకు మద్దతిచ్చిన బిజు జనతాదళ్‌ ఇకపై రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించింది. ఈమేరకు ఎంపీలకు ఆ పార్టీ అధినేత నవీన్‌పట్నాయక్‌ దిశా నిర్దేశం చేశారు.

Published : 25 Jun 2024 00:06 IST

భువనేశ్వర్‌: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్‌ (BJD) అధినేత అధినేత నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) రూటు మార్చారు. సార్వత్రిక ఎన్నికల మునుపు రాజ్యసభలో కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీయేకు సంఖ్యా బలం అవసరమైనప్పుడు ఆ కూటమిలో భాగస్వాములు కాకపోయినప్పటికీ బీజేడీ ఎంపీలు మద్దతిచ్చేవారు. తాజాగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తన నిర్ణయాన్ని మార్చుకుంది. రాజ్యసభలో ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించింది.

పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీలతో భువనేశ్వర్‌లో ఆదివారం నవీన్‌పట్నాయక్‌ సమావేశమయ్యారు. బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలని దిశా నిర్దేశం చేశారు. ఒడిశా ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై సభా వేదికగా గొంతు వినిపించాలని, న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 4.5 కోట్ల మంది ఒడిశా ప్రజల తరఫున బలమైన వాణి వినిపిస్తామని సమావేశం అనంతరం ఎంపీలు మీడియాకు తెలిపారు.

సార్వత్రిక ఎన్నికల ముందు వరకు రెండు పార్టీలు మిత్రపక్షాలుగానే వ్యవహరించాయి. అయితే మార్చిలో ఇరు పార్టీల మధ్య పొత్తు విఫలమవ్వడంతో ప్రత్యర్థి పార్టీలుగా మారాయి. సరిగ్గా ఎన్నికలకు ముంగిట రాజ్యసభలో దిల్లీ సర్వీసుల బిల్లు గట్టెక్కేందుకు, మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఓడించేందుకు బిజు జనతాదళ్‌.. అధికార భాజపాకు మద్దతుగా నిలిచింది. కానీ, ఇకపై ఒడిశాకు ప్రత్యేక హోదా, పేదలు విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై పోరాడాలని నవీన్‌ యోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని