Parliament building: అసలు పార్లమెంట్‌ భవనమే అవసరం లేదు: నీతీశ్‌

Parliament building opening Row: అసలు పార్లమెంట్‌ భవనమే అవసరం లేదని నీతీశ్‌ కుమార్‌ అన్నారు. చరిత్రలో తమకంటూ ఓ పేజీ కోసం ఆరాటమే ఈ భవనం అని చెప్పారు.

Updated : 27 May 2023 17:01 IST

పట్నా: పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సంపై (Parliament building) రగడ కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించగా.. మరికొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పార్లమెంట్‌ భవనమే అవసరం లేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఇసుమంత పాత్ర లేని వారు తమకంటూ చరిత్ర లిఖించుకోవడానికే ఈ పార్లమెంట్ భవనం అని అన్నారు. ఈ మేరకు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.

‘‘అసలు పార్లమెంట్‌ భవనమే అక్కర్లేదు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎలాంటి పాత్రా లేని వారు.. తమదీ అని చెప్పుకోవడానికి ఈ భవనాన్ని నిర్మించారు. అయినా, ఈ కార్యక్రమానికి రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అని నీతీశ్‌ అన్నారు. పట్నాలో ఈ ఉదయం కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్లే నీతీ ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. ఒకవేళ సాయంత్రం సమావేశం ఉంటే హాజరయ్యేవాడినని తెలిపారు. కొందరు మంత్రులు, అధికారులు పేర్లను పంపినప్పటికీ.. కేంద్రం నుంచి సమాధానం రాకపోవడంతో బిహార్‌ నుంచి ప్రతినిధులెవరూ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు.

ఈ సందర్భంగా రెండు వేల రూపాయల నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకోవడంపై నీతీశ్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అప్పుడు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేశారు. ఇప్పుడు రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నారు. వారి ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు’’ అని చెప్పారు. విపక్షాల ఐక్యత గురించి ఇంకో సందర్భంలో మాట్లాడదామంటూ మరో ప్రశ్నకు సమాధానం దాటవేశారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది మర్మును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం పట్నాలో నిరసన తెలియజేయనున్నట్లు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్‌ సింగ్‌ కుశ్వాహా తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు