మేం లేకుండా 2023లో ఎవరూ ఏంచేయలేరు: కుమారస్వామి

కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో......

Published : 27 Jan 2022 01:32 IST

బెంగళూరు: కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు అన్ని పార్టీల్లోనూ సర్వసాధారణ విషయమైపోయిందన్నారు. జేడీఎస్‌ బలోపేతమవుతోందనీ.. అంతేకాకుండా 2023 ఎన్నికల తర్వాత తమ పార్టీ లేకుండా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తమ పార్టీని కాపాడుతూ, దాన్ని పెంచి పోషించే ఓ వర్గం ఉందనీ.. వారెప్పటికీ పార్టీని వీడిపోయేవారు కాదనే అహంతో తానిలా మాట్లాడటంలేదన్నారు. తమ పార్టీ కార్యకర్తల వల్లే జేడీఎస్‌ ఇలా ఉంది తప్ప నేతల వల్ల కాదన్నారు. ఎలాంటి నేతలూ లేకుండానే పలు ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నామన్నారు. గతంలో సిద్ధరామయ్య జేడీఎస్‌లో ఉన్నప్పుడు 19శాతం ఓట్లు సాధించామనీ.. ఆయన బయటకు వెళ్లాక కూడా అలాగే ఉందన్నారు. ఇది కార్యకర్తల వల్లే తప్ప తనవల్ల అని చెప్పుకోవడంలేదన్నారు. మరోవైపు, కుమారస్వామి ఇప్పటికే ‘మిషన్‌ 123’ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను కనీసం 123 సీట్లు గెలుచుకొని స్వతంత్రంగా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఇటీవల వ్యాఖ్యానించని విషయం తెలిసిందే. 

2018లో కర్ణాటకలో ఏ ఒక్కపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కుమారస్వామి సీఎంగా ఉన్నారు. అయితే, 2019లో సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి భాజపాలో చేరడంతో కుమారస్వామి సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అప్పట్లో భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప నేతృత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని