Harish Rao: ఫిరాయింపులతో ఏ పార్టీకీ ప్రయోజనం ఉండదు

ఫిరాయింపులతో ఏ పార్టీకీ ప్రయోజనం ఉండదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో భారాసలో చేరికల వల్ల పార్టీ లబ్ధిపొందిందేమీ లేదన్నారు.

Published : 10 Jul 2024 03:49 IST

రేవంత్‌ ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పలేదు..
మాజీ మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, దిల్లీ: ఫిరాయింపులతో ఏ పార్టీకీ ప్రయోజనం ఉండదని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో భారాసలో చేరికల వల్ల పార్టీ లబ్ధిపొందిందేమీ లేదన్నారు. తమ పార్టీలోకి 12 మంది ఎమ్మెల్యేలు వస్తే అందులో 10 మంది ఓడిపోయారని చెప్పారు. హరీశ్‌రావు మంగళవారం దిల్లీలో విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పలేదు.. ఈ ప్రభుత్వం ఐదేళ్లు సాగితేనే మేలు, దానివల్ల పాలేవో.. నీళ్లేవో తేలిపోతాయని.. ఏ ప్రభుత్వం బాగా పనిచేసిందో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని మా నాయకుడు గతంలో చెప్పారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ సుస్థిరత కోసమే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్న వాదనతో తాను ఏకీభవించనన్నారు. వారికి స్పష్టమైన మెజార్టీ ఉందని, ఎంఐఎం కూడా మద్దతిస్తున్నందున సుస్థిరతకు ముప్పు ఉంటుందని తాను భావించడంలేదని చెప్పారు. ‘మా కుటుంబంలో చిచ్చుపెట్టడానికే అప్పుడప్పుడు రేవంత్‌రెడ్డి నాపై సానుభూతితో మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి అంటున్నట్లు నేను కేసీఆర్‌కేమీ ట్రాప్‌ వేయలేదు.. రేవంత్‌రెడ్డే ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ట్రాప్‌ వేశారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలైనా ఇంకా పాలనపై పట్టు రాలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు కోతలు విపరీతంగా విధిస్తున్నారని.. మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్ల వ్యాపారం ప్రారంభమైందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో జూన్‌ చివరివారానికల్లా 70% మందికి రైతుబంధు కింద డబ్బులు ఇచ్చేవారమని.. ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ పైసాకూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరించడానికే పరిమితమయ్యామని.. మరికొన్ని రోజులు సమయం ఇచ్చి క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగి పాదయాత్రలు, ఉద్యమాల్లాంటివి మొదలుపెడతామని వెల్లడించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నామని చెప్పారు. 

ముఖ్యమంత్రిది రెండు నాల్కల ధోరణి

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి పరిణతి లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతం మరిచిపోయి రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ‘గతంలో గ్రూప్‌-2, టెట్‌ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలిపింది మీరు కాదా..?’ అని రేవంత్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం తగదని హితవు పలికారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే అడ్డగోలుగా మాట్లాడటం తగదన్నారు. రాత్రి, పగలు లెక్క చేయకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని