Prashant Kishor: రాజకీయ పార్టీ పెట్టట్లేదు.. అక్టోబరు 2 నుంచి పాదయాత్ర: ప్రశాంత్‌ కిశోర్‌

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల చేసిన ఓ ట్వీట్‌తో ఆయన రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీకే సొంతంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి.

Updated : 05 May 2022 14:17 IST

దిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల చేసిన ఓ ట్వీట్‌తో ఆయన రాజకీయ ప్రయాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పీకే సొంతంగా రాజకీయ పార్టీని పెట్టబోతున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా దీనిపై ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతానికి కొత్త పార్టీ ఏమీ పెట్టలేదని వెల్లడించిన పీకే.. బిహార్‌ పురోగతి కోసం 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.

‘‘ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకు మార్గం ‘జన సురాజ్‌’. ఈ కొత్త ప్రయాణం బిహార్‌ నుంచే’’ అంటూ ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల ట్విటర్‌లో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన 17వేల నుంచి 18వేల మంది ప్రముఖులను కలిసి మాట్లాడనున్నట్లు పీకే వివరించారు. వారి నుంచి సమస్యలు, అభిప్రాయలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ‘‘ఒకవేళ తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ వేదిక కావాలని బిహార్‌ ప్రజలు కోరకొంటే.. తప్పుకుండా నేను దాని గురించి ఆలోచిస్తాను. అయితే, రాష్ట్రంలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనందున ప్రస్తుతానికి కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచన లేదు’’ అని పీకే వెల్లడించారు.

3వేల కి.మీల పాదయాత్ర..

అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కి.మీల పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ‘‘రాష్ట్ర పురోభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. బిహార్‌ ఇప్పటికీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది. లాలూ, నీతీశ్ పాలనలో రాష్ట్రం ఏ మాత్రం పురోగతి సాధించలేదు. అందుకే వచ్చే మూడు, నాలుగేళ్లు ప్రజలను కలుస్తా. ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటా. వారి నుంచి అభిప్రాయాలు కోరతా’’ అని పీకే తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని