Nitish Kumar: నవీన జాతిపిత దేశానికి ఏం చేశారు..? : నీతీష్‌ కుమార్‌

ప్రధాని అభ్యర్థిత్వంపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మరోసారి స్పష్టతనిచ్చారు. తనకు ఆ పదవిపై ఆశలేదని పేర్కొన్నారు. 

Published : 01 Jan 2023 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని మోదీని నవీన భారత జాతిపితగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌ భార్య అమృత ఫడణవీస్‌ డిసెంబర్‌లో చేసిన వ్యాఖ్యలపై బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ ఘాటుగా స్పందించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘వారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా స్వాతంత్య్ర పోరాటానికి ఏమీ చేయలేదు. నవీన భారత్‌కు సరికొత్త జాతి పిత ఏం చేశారు..?’’ అని వ్యాఖ్యానించారు.  రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేరును ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) పేర్కొన్నారు. తాను ప్రధాని పదవిని కోరుకోవడంలేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో రాహుల్‌(Rahul Gandhi) ప్రధాని అభ్యర్థి కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన కొన్ని రోజుల్లోనే నీతీశ్‌ స్పందించడం గమనార్హం. ‘‘అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలి. ప్రస్తుతం వారు భారత్‌జోడో యాత్రలో బిజీగా ఉన్నట్లున్నారు. భవిష్యత్తు పరిణామాలపై మేం దృష్టిపెట్టాం’’ అని ఓ జాతీయ మీడియాతో నీతీశ్‌ వ్యాఖ్యానించారు.

శనివారం బిహార్‌లో విద్యాశాఖలో వందల మంది ఉద్యోగులకు నియామక పత్రాలు ఇస్తున్న సమయంలో నీతీశ్‌(Nitish Kumar) విలేకర్లతో మాట్లాడారు. భారీ ఎత్తున ఉద్యోగాలిస్తామని వారి కూటమి చేసిన హామీలో భాగంగా ఈ అపాయింట్‌మెంట్‌ లెటర్లను అందజేశారు. 

ఆగస్టు నెలలో కాషాయ పార్టీకి జేడీయూ గట్టి షాక్‌ ఇచ్చింది. భాజపా నుంచి తన రాజకీయ మనుగడకు ముప్పు పొంచి ఉందన్న భావనతో జేడీయూ అధినేత, సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆ పార్టీతో సుదీర్ఘ బంధానికి గుడ్‌బై చెప్పారు. ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని