పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్‌పై నివేదికలేవీ?.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిగ్విజయ్‌

సర్జికల్‌ దాడులు, పుల్వామా దాడి ఘటనలకు సంబంధించిన నివేదికలను కేంద్రం ఇప్పటి వరకు కేంద్రం పార్లమెంట్‌కు సమర్పించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

Published : 24 Jan 2023 01:18 IST

దిల్లీ: పాక్‌ ఉగ్ర స్థావరాలపై 2016లో జరిపిన సర్జికల్‌ దాడులు (Surgical strike), పుల్వామా దాడి (Pulwama) ఘటనలపై కాంగ్రెస్‌ పార్టీ (Congress) సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ (Digvijaya Singh) ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన నివేదికలను ఇప్పటి వరకు భారత్‌ ప్రభుత్వం పార్లమెంట్‌కు ఎందుకు సమర్పించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. సర్జికల్‌ దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేదని ఆరోపించారు. రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రలో (Bharat jodo yatra) ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం దిగ్విజయ్‌ మాట్లాడుతూ ఈ అంశాలను ప్రస్తావించారు.

పుల్వామాలో పాకిస్థాన్‌కు చెందిన జైషే-ఇ-మహ్మద్‌ ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. ఈ ఘటనపై పార్లమెంట్‌కు ఇప్పటి వరకు ప్రభుత్వం నివేదిక సమర్పించలేదని దిగ్విజయ్‌ విమర్శించారు. ఉగ్రవాద దాడులకు ఆస్కారం ఉన్న పుల్వామాలో కార్లను నిత్యం పక్కాగా తనిఖీ చేస్తారని చెప్పారు. అలాంటిది ఆ ఒక్కరోజే ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న స్కార్పియో కారును తనిఖీ చేయకుండా ఎలా విడిచి పెట్టారని ప్రశ్నించారు. అలాగే 2016లో జమ్మూకశ్మీర్‌లోని ఉరీ ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన సర్జికల్‌ దాడులపైనా దిగ్విజయ్‌ ప్రశ్నలు లేవనెత్తారు. సర్జికల్‌ దాడుల్లో ఎంతోమంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెబుతున్నప్పటికీ.. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారమూ చూపించలేదని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని