Maharashtra: బాలాసాహెబ్, శివసేన పేర్లు ఇతరులు వాడొద్దు.. ఈసీని ఆశ్రయించిన ఉద్ధవ్ వర్గం..!

అసమ్మతి నేతలు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఉపయోగించకుండా ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

Published : 25 Jun 2022 18:11 IST

ముంబయి: అసమ్మతి నేతలు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఉపయోగించకుండా ఆపాలని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం శనివారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ముంబయిలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దానికి ఆమోదం లభించింది. బాలాసాహెబ్, శివసేన పేర్లను ఏ వర్గం ఉపయోగించకుండా చూడాలంటూ ఉద్ధవ్ వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 

‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న కొందరు ఎమ్మెల్యేలు.. బాలాసాహెబ్, శివసేన పేర్లను దుర్వినియోగం చేసి, గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మేం అనుమానిస్తున్నాం. శిందే, ఆయన వర్గం కోరుకున్నట్లుగా వారు రాజకీయ పార్టీ పెట్టుకోవడాన్ని మేం నిషేధించలేం. అయితే ఈ రెండు పేర్లను ఉపయోగించడాన్ని మాత్రం మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగా మీ దృష్టికి తీసుకువస్తున్నాం’ అని ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. శిందే వర్గం కొత్త పార్టీ స్థాపించనుందని, దానికి ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ అని పేరు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం ఈసీని ఆశ్రయించింది. అలాగే ఈ రెండు పేర్లను ఉపయోగించిన వారిపై చట్టపరంగా ముందుగు వెళ్తామని పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు. తాము ఉద్ధవ్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామని చెప్పారు. 

16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు..

పార్టీ విప్ సునీల్ ప్రభు ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరైనందుకు 16 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు అందాయి. వారంతా సోమవారం సాయంత్రం ఐదులోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని