Assam: ‘కుక్క మాంసం’ వివాదం.. అసెంబ్లీలో రసాభాస!

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు.  సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో  చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Published : 11 Mar 2023 01:41 IST

గువాహటి: మహారాష్ట్ర (Maharashtra) ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అస్సాం అసెంబ్లీ (Assam Assembly) లో దుమారం చెలరేగింది. బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. గవర్నర్‌ ప్రసంగం పూర్తయిన వెంటనే విపక్షాలు అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం సృష్టించాయి. దీంతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని 15 నిమిషాలకు కుదించారు. అది పూర్తయిన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

ఇంతకీ ఏం జరిగిందటే.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రహర్‌ జనశక్తి పార్టీకి చెందిన ఎమ్మెల్యే బచుహు కదు మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కొన్ని వీధి కుక్కలను అస్సాం పంపిస్తే వాటి సంఖ్యను తగ్గించొచ్చని అన్నారు. అక్కడ కుక్క మాంసాన్ని ఎక్కువగా తింటారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తాజాగా అస్సాం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అస్సాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అస్సాంలో భాజపా నేతృత్వంలోని హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని