జైలు పేరుతో బెదిరించలేరు: మమతా బెనర్జీ

తనలో ప్రాణమున్నంతకాలం ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు.

Updated : 22 Feb 2021 05:22 IST

కోల్‌కతా: తనలో ప్రాణమున్నంతకాలం ఎలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. జైలు, ఇతర పేర్లతో బెదిరించే ప్రయత్నం చేయొద్దని, ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడిన తమకు, ఎలుకలపై పోరాడేందుకు భయపడబోమని అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈవిధంగా మాట్లాడారు. ఆమె అల్లుడు అభిషేక్‌ బెనర్జీ కుటుంబీకులకు సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీపై మమతా బెనర్జీ ఇలా స్పందించారు.

ఏ వ్యక్తిని, పార్టీ పేరును చెప్పనప్పటికీ.. తాము ఓటమిని ఎప్పుడూ నేర్చుకోలేదని, మమ్మల్ని ఓడించే సామర్థ్యం వారికి(భాజపా) లేదని మమతా బెనర్జీ అన్నారు. ‘2021 సంవత్సరంలో ఒకే ఒక్క సవాల్‌ మనముందు ఉంది. ఎవరి బలం ఏంటో తెలిసిపోతుంది. ఈ ఆటలో నేను గోల్‌కీపర్‌గా ఉండి, మ్యాచ్‌లో ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అనే విషయాన్ని చూడాలి అనుకుంటున్నా’ అని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమ్‌ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం  వేడెక్కింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశిస్తోన్న భారతీయ జనతా పార్టీ, మమతా సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది. భాజపా అధ్యక్షుడితో పాటు పలువురు కేంద్ర మంత్రులు బెంగాల్‌లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వీరి విమర్శలకు ధీటుగా స్పందిస్తోన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పటికప్పుడూ భాజపా నాయకులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని