‘ఓ మాజీ సీఎం నుంచి అలాంటి మాటల్ని ఊహించలేదు’

వారణాసిలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆఖరి గడియలు సమీపించినప్పుడే .....

Published : 15 Dec 2021 01:37 IST

అఖిలేశ్‌ వ్యాఖ్యలపై అనురాగ్‌ ఠాకూర్‌ మండిపాటు

దిల్లీ: వారణాసిలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడుతోంది. ‘ఆఖరి గడియలు సమీపించినప్పుడే ఎవరైనా కాశీకి వచ్చి బస చేస్తారు’ అంటూ అఖిలేశ్‌ చేసిన వ్యాఖ్యలపై  తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ విరుచుకుపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి అలాంటి భాషను తాను ఊహించలేదన్నారు. తనకంటే పెద్ద వారి పట్ల అలాంటి పదజాలం వాడటం దురదృష్టకరమన్నారు. ఆయన వ్యాఖ్యలు కాశీ, రామ మందిరం పట్ల సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎవరినైనా అలాంటి మాటలు అనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవుపలికారు. అఖిలేశ్ వ్యాఖ్యలు ఆయన మనస్తత్వాన్ని, పెంపకాన్ని సూచిస్తున్నాయన్నారు. ఎస్పీ నేతలు వాడుతున్న భాష వారిలో ఆందోళనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, అఖిలేశ్ యాదవ్‌ నిన్న ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే భాజపా కౌంటర్ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలు క్రూరమైనవిగా ఉన్నాయంటూ.. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చింది. క్రూరమైన, అనాగరికమైన వ్యాఖ్యలు అఖిలేశ్‌ మనస్తత్వాన్ని చాటుతున్నాయంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ నిన్న మండిపడ్డారు. అయితే, ప్రహ్లాద్‌ జోషీ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధకార ప్రతినిధి రాజేంద్ర చౌధురి కౌంటర్‌ ఇచ్చారు. అఖిలేశ్‌ మాటల్ని భాజపా వక్రీకరిస్తోందన్నారు. ఆయన యూపీ ప్రభుత్వానికి చివరి రోజులు గురించి మాట్లాడారు తప్ప ప్రత్యేకించి ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి అనలేదన్నారు.

Read latest Political News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని