Congress: నేను అందుకే పార్టీ అధ్యక్ష రేసులో దిగలేదు: కమల్‌నాథ్‌

రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో....

Published : 29 Sep 2022 01:23 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని.. తన దృష్టి అంతా వచ్చే ఏడాది జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ అన్నారు. రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడం వల్లే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజస్థాన్‌ పరిణామాలతో కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన భోపాల్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాహుల్‌ గాంధీతో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరినట్టు కమల్‌నాథ్‌ చెప్పారు. అప్పుడే ఈ గందరగోళానికి తెరపడుతుందని చెప్పానన్నారు. పార్టీలో పరిణామాలు సంక్లిష్టంగా మారుతున్నాయని కూడా ఆయనకు వివరించినట్టు వెల్లడించారు. అయితే, అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రాహుల్ సుముఖంగా లేనని తేల్చి చెప్పారని కమల్‌నాథ్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ అధ్యక్షుడిగా ఉండాలనుకోవడంలేదు గనకే ఎన్నికలు జరుగుతున్నాయని.. మరి జేపీ నడ్డా ఎలాంటి ఎన్నిక జరగకుండానే భాజపా అధ్యక్షుడయ్యారు కదా అని విమర్శించారు. ఎన్నికల విషయం పక్కనబెడితే.. నడ్డాను అధ్యక్షుడిని చేసే ముందు భాజపా 10మంది నేతల అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని కమల్‌నాథ్‌ ధ్వజమెత్తారు. 

అందుకే రేసులో దిగలేదు..

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు మీరెందుకు పోటీ చేయట్లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కమల్‌నాథ్‌ స్పందించారు. ఇటీవల తాను దిల్లీకి వెళ్లి సోనియాతో చర్చలు జరిపిన విషయాన్ని వెల్లడించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 నెలల సమయం ఉందని.. ఈ సమయంలో తాను మధ్యప్రదేశ్‌ను వదిలిపెట్టబోనన్నారు. ఒకవేళ తాను అధ్యక్ష పదవి చేపడితే తన దృష్టంతా మధ్యప్రదేశ్‌ వైపు ఉండదని.. ఆ పరిస్థితి తనకు ఇష్టంలేదని స్పష్టంచేశారు. అందుకే అధ్యక్ష బాధ్యతలు తీసుకొనేందుకు తాను సిద్ధంగా లేనట్టు స్పష్టంచేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి తన దృష్టిని వేరే వైపు పెట్టదలచుకోలేదన్నారు.

ఆ విషయం దిగ్విజయ్‌నే అడగండి..

కాంగ్రెస్‌కు కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరైనా తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లపైనే ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంటుందని కమల్‌నాథ్‌ సూచించారు. అలాగే, ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉందన్నారు. మరోవైపు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదన్నారు. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ నామినేషన్‌ గురించి ప్రస్తావించగా.. ఆయనతో చర్చించానని.. ఎన్నికలు ఉన్నందునే ఆయన నామినేషన్‌ వేయాలనుకొంటున్నారన్నారు.  దిగ్విజయ్‌ సింగ్‌ పోటీచేసే అవకాశం ఉందా? అని అడగ్గా.. ఆయనకు ఇష్టం ఉందో లేదో దిగ్విజయ్‌నే అడగాలంటూ బదులిచ్చారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని