Akhilesh-Rahul: అఖిలేశ్‌ను చూసి అలా అనుకోవడంలో పొరపాటేం లేదు : యోగి

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీల మధ్య చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పేర్కొన్నారు.

Published : 01 Jun 2022 02:24 IST

ఎస్‌పీ నేతపై యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ విమర్శలు

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీల మధ్య చెప్పుకోదగ్గ తేడా ఏమీ లేదని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ పేర్కొన్నారు. ఒకరు విదేశాలకు వెళ్లి సొంత దేశంపై విమర్శలు గుప్పిస్తుంటే.. మరొకరు రాష్ట్రం బయటకు వెళ్లి స్వరాష్ట్రంపై విమర్శలు చేస్తారని అన్నారు. అఖిలేశ్‌ యాదవ్‌ను చూసిన ఓ విద్యార్థి రాహుల్ గాంధీ అని పేర్కొన్న సంఘటనను ప్రస్తావించిన యోగి.. చిన్నారులు అమాయకులు కావొచ్చేమో గానీ ఆ విద్యార్థి మాత్రం కొంచెం ఆలోచించే ఆ విధంగా సంబోధించి ఉంటారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోన్న సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌పై యోగి ఆదిత్యనాథ్‌ సెటైర్లు వేశారు.

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయానని.. నాణ్యమైన విద్య అందడం లేదని ఎస్‌పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ అసెంబ్లీలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ పాఠశాలను సందర్శించిన సమయంలో ఓ విద్యార్థి తనను చూసి రాహుల్‌ గాంధీ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి .. ‘ఆ విద్యార్థి అలా చెప్పడంలో పొరపాటేం లేదు. అతను బాగా ఆలోచించే అలా పిలిచి ఉండవచ్చు’ అని అన్నారు. దీంతో సభలో అధికార పార్టీ సభ్యులు నవ్వుతూ బెంచీలపై చప్పట్లతో యోగీకి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడిన అఖిలేశ్‌ యాదవ్‌.. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై చింతించాల్సింది పోయి కాంగ్రెస్‌ నేతపై చర్చిస్తున్నారని మండిపడ్డారు.

ఇదిలాఉంటే, 2012 నుంచి 2017 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అఖిలేశ్‌ యాదవ్‌ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక 2017 ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్ గాంధీలు చేతులు కలిపినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా బరిలోకి దిగగా.. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ఆర్‌ఎల్‌డీతోపాటు పలు ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఎస్‌పీ కొంత పుంజుకున్నప్పటికీ కాంగ్రెస్‌ మాత్రం ఉన్న సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది. ప్రస్తుతం యూపీలో రెండు స్థానాలతోనే కాంగ్రెస్‌ సరిపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని