Goa Polls: పార్టీలోఉంటా.. పోటీ నుంచేతప్పుకొంటున్నా: మాజీ సీఎం ఫలైరో

గోవాలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం లుజినో......

Published : 29 Jan 2022 01:57 IST

పనాజీ: గోవాలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం లుజినో ఫలైరో ప్రకటించంతో ఆయన పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించారు. తాను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడటంలేదని స్పష్టం చేశారు. ఫటోర్దా నుంచి తాను పోటీ చేయడంలేదనీ.. తనకు బదులుగా ఓ యువ మహిళా అభ్యర్థిని బరిలోకి దించుతున్నామన్నారు. మహిళలకు సాధికారత కల్పించడం తమ పార్టీ విధానమన్నారు. తాను పార్టీని వీడుతున్నట్టుగా వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని సంప్రదించిన తర్వాతే తానీ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటుకే పరిమితం కాకుండా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకే పోటీ చేయడంలేదన్నారు. అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ గోవా ఎన్నికల ఇంఛార్జి, ఎంపీ మెహువా మొయిత్రా మాట్లాడుతూ.. ఫటోర్దా సీటు నుంచి ఓ యువ మహిళను బరిలో దించుతున్నామన్నారు. ఆమెకు ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యమూ లేదన్నారు. ఇక్కడ పోటీచేయడం తమ చివరి ఆప్షన్‌ కాదనీ.. భాజపాను వద్దనుకుంటున్న ఫటోర్దా ప్రజలకు నిజమైన ఎంపికగా నిలుస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం ఫలైరో తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరగా.. దీదీ ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని