Siddaramaiah: మెజార్టీ ఎమ్మెల్యేలు నా వెంటే: సిద్ధరామయ్య

కర్ణాటక(Karnataka)లో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.  

Published : 15 May 2023 23:57 IST

బెంగళూరు: కర్ణాటక సీఎం(Karnataka CM Post) పీఠాన్ని అధిష్ఠించేదెవరు..? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) మధ్య ఆ పదవికోసం గట్టి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలోనే ఉంది. హైకమాండ్ పిలుపు మేరకు సిద్ధరామయ్య ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. ఆయన దిల్లీకి వెళ్లేముందు.. కర్ణాటక సీఎం పదవి విషయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని వెల్లడించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తనకూ శివకుమార్ మధ్య మంచి సంబంధాలున్నాయని తెలిపారు. అంతేగాకుండా భాజపాయేతర పార్టీలన్నీ తమతో కలిసిరావాలని కోరారు.

ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం: ఏఐసీసీ పరిశీలకులు

‘మేం నిన్నరాత్రి  4-5 గంటల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపాం. వారి నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సమర్పిస్తాం’ అని పరిశీలకుల్లో ఒకరైన భన్వర్‌ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ‘పరిశీలకులు ఈ రోజు రాత్రి తమ నివేదిక సమర్పిస్తారు. అతి త్వరలోనే మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని కాంగ్రెస్ ఎంపీ రణదీప్‌ సింగ్ సూర్జేవాలా వెల్లడించారు. ఇటీవల వెల్లడైన కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. 224 అసెంబ్లీ స్థానాలకు గానూ..135 చోట్ల హస్తం జెండా రెపరెపలాడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని