Naveen Patnaik: ఓహో.. మీరేనా నన్ను ఓడించింది.. కంగ్రాట్స్‌: నవీన్‌ పట్నాయక్‌

గౌరవంగా రాజకీయాలు చేసే వ్యక్తులు దేశంలో కొందరే కనిపిస్తారు. అందులో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఒకరు. మృదుస్వభావి అయిన ఆయన మంగళవారం సభలో తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకొని.. సభ్యులు, ప్రజల మన్ననలందుకున్నారు.

Updated : 19 Jun 2024 07:51 IST

 

సభలో ఎమ్మెల్యే లక్ష్మణ్‌ బాగ్‌ను అభినందిస్తున్న మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గౌరవంగా రాజకీయాలు చేసే వ్యక్తులు దేశంలో కొందరే కనిపిస్తారు. అందులో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఒకరు. మృదుస్వభావి అయిన ఆయన మంగళవారం సభలో తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకొని.. సభ్యులు, ప్రజల మన్ననలందుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల(గంజాం జిల్లాలోని హింజలి, బొలంగీర్‌ జిల్లాలోని కంటాబంజి)నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కంటాబంజిలో భాజపా అభ్యర్థి లక్ష్మణ్‌ బాగ్‌ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం అందరినీ పలకరించేందుకు వెళ్తుండగా అప్పటికే సభలో కూర్చున్న లక్ష్మణ్‌ బాగ్‌ నవీన్‌ పట్నాయక్‌ను చూసి లేచి నమస్కరించారు. పరిచయం చేసుకున్నారు. నవీన్‌ పట్నాయక్‌ వెంటనే ‘ఓహో.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’ అని అన్నారు. దీంతో అక్కడున్న సీఎం మోహన్‌ మాఝి, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. ఓడించిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించిన ఆయన తీరుకు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు మాజీ సీఎంను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం అన్ని చోట్లా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. 24 ఏళ్లు ఒడిశాకు సీఎంగా సేవలందించిన నవీన్‌ పట్నాయక్‌ సారథ్యం వహించిన బిజు జనతాదళ్‌ పార్టీ ఈ సారి పరాజయం పొందగా.. భాజపా అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని