Published : 16 May 2022 01:56 IST

Sharad Pawar: శరద్‌ పవార్‌పై పోస్ట్‌! మహారాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి చెంప చెళ్లు

ముంబయి: ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌పై అనుచిత పోస్టుల వేడి చల్లారడం లేదు! పవార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ తాజాగా పుణెలో భాజపా మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌తో ఎన్‌సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆయన చెంప చెళ్లుమనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మహారాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్‌సీపీ గూండాలు దాడి చేశారు. పార్టీ తరఫున ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. పవార్‌పై అభ్యంతరకర పోస్ట్‌లను షేర్ చేసినందుకుగానూ శనివారం వేర్వేరు ఘటనల్లో మరాఠీ నటి కేతకి చితలే, ఫార్మసీ విద్యార్థి నిఖిల్ భామ్రేను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేతకిని ఆదివారం ఇక్కడి హాలీడే కోర్టులో ప్రవేశపెట్టగా.. మే 18 వరకు పోలీసు కస్టడీ విధించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు.. శరద్‌ పవార్‌లాంటి సీనియర్ రాజకీయవేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. ఇది రాష్ట్ర దురదృష్టమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం పౌరులకు భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్య హక్కును కల్పించిందని.. అయితే, ఏం మాట్లాడుతున్నామో, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. 60 ఏళ్లుగా పవార్‌ ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని.. ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఇతరులపై ఆయన ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని