Maharashtra: ఉద్ధవ్‌ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!

మహారాష్ట్ర రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏక్‌నాథ్‌ శిందే..

Published : 05 Jul 2022 01:57 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి తన బలాన్ని నిరూపించుకున్నారు. విశ్వాస పరీక్షకు కొద్ది సేపటికే మరో శివసేన ఎమ్మెల్యే ఒకరు తన రూటు మార్చుకొని ఏక్‌నాథ్‌ శిందేకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు సమయంలో ఆయన ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతుగా నిలవాలని కోరుతూ కన్నీటి పర్యంతమవ్వడం గమనార్హం.

రెబల్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతుగా నిలిచారు. ఆయన వెంటే ఉంటామని హామీనిచ్చారు. దానికోసం రాష్ట్రంలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెబల్‌ ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగిరావాలని కోరారు. ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యే సంతోష్‌ భాంగర్‌ వారం క్రితం(జూన్‌ 24న) తన కలమ్నూరి నియోజకవర్గంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్‌ వద్దకు ఏక్‌నాథ్‌ తిరిగి రావాలని కోరారు. భావోద్వేగానికి గురయ్యి కన్నీరు కూడా పెట్టుకున్నారు. ‘ఉద్ధవ్‌ ఠాక్రే జీ.. మేం మీతో ఉన్నాం’ అని నినాదాలు కూడా చేశారు. కానీ, ఇవాళ బలపరీక్ష సమయంలో ఉన్నట్టుండి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం శిందేకు అనుకూలంగా ఓటేశారు. ఇదంతా మహారాష్ట్ర ప్రజలను ఒకింతా ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నిన్నటి దాకా ఠాక్రేకు మద్దతు తెలిపి.. నేడు ఏక్‌నాథ్‌ వైపు వెళ్లడం ఏంటి మరి విడ్డూరం కాకపోతేనూ.. రాజకీయం అంటే ఇదేనేమో.. టైం చూసి ప్లేట్‌ ఫిరాయించాలేమో?’ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారంతా!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని