
UP Polls: పిరికివాళ్లు మాత్రమే అలా చేస్తారు: సుప్రియా శ్రీనతె
దిల్లీ: యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసల జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. తమ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆర్పీఎన్ సింగ్ ప్రకటించడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయలో మండిపడుతోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె మీడియాతో మాట్లాడుతూ.. పిరికివాళ్లు మాత్రమే పూర్తిగా విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీల వైపు వెళ్తారంటూ వ్యాఖ్యానించారు. భాజపా, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పోరును రాజకీయ సైద్ధాంతిక యుద్ధంగా ఆమె అభివర్ణించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే ఎంతో ధైర్యం, బలం కావాలన్నారు. పిరికివాళ్లు మాత్రమే పూర్తి వ్యతిరేక సిద్ధాంతాలు కలిగిన పార్టీల వైపు దూకుతుంటారని సుప్రియా ఆక్షేపించారు.
మరోవైపు గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆర్పీఎన్ సింగ్.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖను ట్విటర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న వేళ తన రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే, ఇప్పటికే దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ఆర్పీఎన్ సింగ్.. దేశ నిర్మాణంలో తన వంతు సహకారం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల నాయకత్వం, మార్గదర్శకత్వంలో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. మరికాసేపట్లో ఆయన భాజపాలో చేరనున్నారు.