Congress : మనకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది : ప్రియాంకా గాంధీ

లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.

Published : 27 Feb 2023 01:33 IST

నయా రాయ్‌పుర్‌ : నయా రాయ్‌పుర్‌లో కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్లీనరీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేదికపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) మాట్లాడుతూ పత్రిపక్షాలన్నీ ఏక తాటిపైకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత.. కాంగ్రెస్‌ మరింత ఎక్కువగా కోరుకుంటోందని ఆమె స్పష్టం చేశారు. ‘మనకు ఒక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ప్రతి పక్షాలకు (opposition) కొన్ని అంచనాలుంటాయి. మనమంతా కలిసి ఉండాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలి. భాజపా(BJP) భావజాలాన్ని వ్యతిరేకించే వ్యక్తులంతా కలిసి రావాలి. ఐక్యంగా పోరాటం సాగించాలి. అందరిపైనా అంచనాలున్నాయి. కాంగ్రెస్‌పై ఇంకా ఎక్కువే ఉన్నాయని’ ప్రియాంక పార్టీ శ్రేణులనుద్దేశించి అన్నారు. 

ఇక పార్టీని బలోపేతం చేయడానికి యత్నిస్తున్న కార్యకర్తలపై ఆమె ప్రశంసల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఉద్బోధ చేశారు. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలని దిశానిర్దేశం చేశారు. భాజపాతో పోరాడే ధైర్యం మీలో ఉందన్న విషయం తెలుసన్నారు. దేశం కోసం ఆ బలాన్ని చూపించే సమయం ఆసన్నమైందని చెప్పారు. మండల స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఛత్తీస్‌గడ్‌లోని నయా రాయ్‌పుర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇది వరకే ఈ సమావేశాల్లో మాట్లాడిన కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పొత్తులకు రావాలని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చారు. భాజపా విద్వేష పాలన సాగిస్తోందని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. అదానీ గ్రూప్‌ అవకతవకల అంశాన్ని ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ సైతం అధికార భాజపాపై విరుచుకుపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని