Budget 2023: రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదు : విపక్షాలు

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పదలచుకున్న అంశాలనే రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారని మండిపడ్డాయి.

Published : 31 Jan 2023 20:05 IST

దిల్లీ: బడ్జెట్‌ సమావేశాల (Budget 2023) నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపత్రి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంపై విపక్ష పార్టీలు పెదవి విరిచాయి. రాష్ట్రపతి (President) చేసిన ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్నాయి. ప్రభుత్వం ఏది చెబితే దాని గురించే రాష్ట్రపతి మాట్లాడారని విమర్శలు గుప్పించాయి. ముఖ్యంగా ధరల నియంత్రణ, మత సామరస్యం, మహిళా సమస్యల ఊసే లేదని పేర్కొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగం పేద ప్రజలు, నిరుద్యోగులను ఏ మాత్రం సంతృప్తి పరచలేదని పేర్కొన్నాయి.

‘రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో మాదిరిగా అంతా మంచే ఉంటే.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు బాధపడేవారు కాదు. అవినీతి తొలగించామని ప్రభుత్వం చెబుతోంది. మరి కేవలం ఒక్క వ్యక్తి ఎల్‌ఐసీ/ఎస్బీఐతోపాటు ఇతర బ్యాంకులను ఎలా మోసం చేయగలుగుతారు. ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టిన 30కోట్ల మంది ఇప్పుడు బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తులపై మాత్రం చర్యలు లేవు’ అని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదన్న ఆయన.. రాష్ట్రపతి నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు కాబట్టి వ్యక్తిగతంగా అందరూ స్వాగతిస్తారని అన్నారు. రాష్ట్రపతిపై ఎటువంటి విమర్శలు చేయడం లేదని.. కేవలం నరేంద్ర మోదీ బయట చెప్పిన విషయాలనే పేర్కొన్నారని అన్నారు.

పేదరికం, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో బాధపడుతోన్న ప్రజలను రాష్ట్రపతి చేసిన ప్రసంగం సంతృప్తి పరచలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే దేశం పురోగతి సాధించినట్లు అవుతుందని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డేరెక్‌ ఓబ్రెయిన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం రాసిచ్చిన నివేదికనే రాష్ట్రపతి చదవడం సంప్రదాయంగా వస్తున్నప్పటికీ కీలక సమస్యలను ప్రస్తావించలేదన్నారు. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించడం, మతసామరస్యాన్ని పెంచడం, మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం వంటి అంశాలు మిస్సయ్యాయని విమర్శించారు. మహిళలు, యువత, దళిత, వెనుకబడిన తెగలవారి సాధికారత కేవలం పేపర్లకే పరిమితమైందని సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస, ఆమ్ఆద్మీ పార్టీలు బహిష్కరించడాన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని