Politics:కాంగ్రెస్‌ లేకపోతే కూటమి అసంపూర్ణమే

జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అందులో కాంగ్రెస్‌ భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో...

Published : 26 Jun 2021 19:02 IST

సంజయ్‌ రౌత్‌

దిల్లీ: జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అందులో కాంగ్రెస్‌ భాగస్వామ్యం లేకపోతే అది సంపూర్ణం కాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార భాజపాకు సరైన ప్రత్యామ్నాయంగా నిలవాలంటే కూటమిలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని అయన అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో తృణమూల్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ఆద్మీ, ఆర్‌ఎల్‌డీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన కీలక నేతలు శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే.  దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి చర్చించినట్లు సమావేశ అనంతరం వెల్లడించారు. ఈ భేటీపై భారీ ఊహాగానాలు చెలరేగాయి. భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి.  అయితే ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్‌తోపాటు వైకాపా, తెదేపా నేతలు హాజరు కాలేదు.

ఈ అంశంపై తాజాగా సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ‘‘ దేశంలో మూడో కూటమి, ఇతర ఏ కూటమి అవసరం లేదు. శరద్‌ పవార్‌ కూడా ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘సామ్నా’ పత్రిక ఇదే విషయాన్ని చెప్పింది.  మరోవైపు కాంగ్రెస్‌ ఆలోచన కూడా అదే. భాజపాకు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్‌ కోసం పటిష్ఠమైన ప్రతిపక్షం అవసరం. విపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటిమీదకు తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నా... కాంగ్రెస్‌ లేకపోతే అది సంపూర్ణం కాదు’’ అని రౌత్‌ వెల్లడించారు.

శుక్రవారం సమావేశం ముగిసిన తర్వాత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటుపై చర్చించ లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఒక వేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు సమావేశం జరిగిన తర్వాత రోజున మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే స్పందిస్తూ కాంగ్రెస్‌ లేకుండా భాజపాకు వ్యతిరేకంగా ఏ కూటమి ఏర్పాటైనా అది కాషాయ పార్టీకి మేలే చేస్తుందని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని