Opposition Parties: ఖర్గే నివాసంలో విపక్ష నేతల భేటీ.. మంగళవారమూ నల్ల దుస్తుల్లో నిరసన!

పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రతిపక్ష పార్టీల నేతలంతా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు.

Published : 27 Mar 2023 23:04 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా నల్లదుస్తులు ధరించి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష పార్టీల ఎంపీలు తమ నిరసనను మంగళవారం కూడా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భావసారూప్యం కలిగిన విపక్ష పార్టీల నేతలంతా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్‌సీపీ, జేడీయు, భారాస, సీపీఎం, సీపీఐ, ఆప్‌, ఎమ్‌డీఎమ్‌కే, కేసీ, టీఎమ్‌సీ,ఆర్‌ఎస్‌పీ, ఆర్‌జేడీ, జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఐయూఎమ్‌ఎల్‌, వీసీకే, సమాజ్‌వాదీ పార్టీ, జేఎమ్‌ఎమ్‌ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, జైరాం రమేష్‌ వంటి నేతలతోపాటు, శరద్‌ పవార్‌ వంటి సీనియర్‌ నాయకులు హాజరయ్యారు.

ఈ భేటీలో ముఖ్యంగా అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటుకు డిమాండ్, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వంటి అంశాలపై అనుసరించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం. ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీఎంసీ కూడా మద్దతు తెలిపింది. గత కొంతకాలంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కొత్త కూటమి నెలకొల్పేందుకు ఎస్‌పీతో కలిసి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి ఈ రెండు పార్టీల నేతలు హాజరుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆగ్రహంగా ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఈ భేటీకి హాజరుకాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని