Manipur Row: భాగవత్‌ సలహాను మోదీ వినాలి

ఏడాది నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపుర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైనా పర్యటించాలని, ఈ విషయంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ‘సూచన’ను పాటించాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు విజ్ఞప్తిచేశాయి.

Published : 12 Jun 2024 05:24 IST

మణిపుర్‌పై ప్రధానికి సూచించిన విపక్షం

దిల్లీ: ఏడాది నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న మణిపుర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైనా పర్యటించాలని, ఈ విషయంలో ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ ‘సూచన’ను పాటించాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు విజ్ఞప్తిచేశాయి. మణిపుర్‌లో పర్యటించేందుకు మోదీ అంతరాత్మ అంగీకరించకపోతే ఆరెస్సెస్‌ మాజీ నేత అయిన ఆయనపై భాగవత్‌ ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ సూచించారు. మణిపుర్‌ అల్లర్లు, మహిళా రెజ్లర్ల ఆందోళన, రైతుల నిరసనలు సహా ఏ సంక్షోభం విషయంలోనైనా మోదీ మౌనంగానే ఉంటున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. మణిపుర్‌ అల్లర్లపై భాగవత్‌ చాలా ఆలస్యంగా స్పందించారని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రిమండలిలో ముస్లింల నుంచి ఎలాంటి ప్రాతినిధ్యం లేదని, వారి పట్ల భాజపాకు ఉన్న ద్వేషానికి ఇది నిదర్శనమని యాదవ్‌ అన్నారు. భాగవత్‌ సూచనను రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ ఆహ్వానించారు. గత పదేళ్ల పాలనలో జరిగినవాటిని పునరావృతం కానివ్వకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు తమను ప్రతిపక్షంగా పిలిచేవారని, మోదీ మాత్రం తమను విరోధులుగా మార్చేశారని అన్నారు. విపక్షం చెప్పేది వినడం మోదీ డీఎన్‌యేలోనే లేదని, కనీసం భాగవత్‌ మాటలైనా వినాలని చెప్పారు. నెహ్రూను, మోదీని సరిపోల్చి చూడరాదన్నారు. మణిపుర్‌లో తాజాగా సీఎం వాహనశ్రేణిపై దాడి జరిగిందని, అక్కడ ఏదో తేడాగా ఉందని ఎన్సీపీ (శరద్‌పవార్‌) నేత సుప్రియా సూలే వ్యాఖ్యానించారు. మణిపుర్‌ మన దేశంలో అంతర్భాగమైనా తమను అక్కడ పర్యటించనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని