Opposition alliance: ప్రతిపక్షాల ప్రయత్నాలు ఈ సారైనా ఫలించేనా?

ప్రతిపక్షాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnatak assembly Elections) తర్వాత భాజపాయేతర పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు.

Published : 29 Apr 2023 20:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపాయేతర పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కమల దళానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌తో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌తో భేటీ సమయంలో వామపక్ష నేతలు పాల్గొన్నారు. కూటమిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనే తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. మరోవైపు కూటమి ఏర్పాటులో భాగంగానే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. 

ఒకానొక దశలో కూటమి ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. అంతకు ముందు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను తన ఇంటికి ఆహ్వానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కూటమిపై చర్చించేందుకు భాజపాయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి ఆయన లేఖలు రాశారు. అయితే ఎవరూ రాకపోవడంతో ఆ భేటీ పూర్తిగా విఫలమైంది. ఇంతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ లాంటి పార్టీలు తమ దృష్టిని ఎన్నికల వైపు మళ్లించాయి.

అయితే, తాజాగా మరోసారి ప్రత్యామ్నాయ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తాజాగా హింట్‌ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే కూటమి ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశంపై మేం కచ్చితంగా కలిసి కూర్చుని చర్చిస్తాం. ప్రస్తుతం కొంత మంది నేత‌లు క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజీగా ఉన్నారు. అవి ముగిసిన తర్వాత,  సమావేశం జరిగే స్థలాన్ని ఖరారు చేస్తాం. విపక్ష నేతలంతా పాట్నాను ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ఇక్కడే నిర్వహిస్తాం’’ అని నీతీశ్‌ కుమార్ చెప్పారు.

మమతతో భేటీయే కారణమా?

కూటమి ఏర్పాటు అంశం డీలా పడిపోయిన తర్వాత.. ఏప్రిల్‌ 24న ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్‌తో కోల్‌కతాలో మమతాబెనర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి ఏర్పాటుపై  ముగ్గురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భాజపా యేతర పార్టీలతో మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించాల్సిందిగా మమతా బెనర్జీ కోరారు. వీలైతే పట్నాలోనే భేటీని నిర్వహించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత చర్చల అనంతం మరోసారి భాజపా యేతర పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని నితీశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ భాజపాకి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు.. మా వంతు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. ఇటీవల చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులతో మాట్లాడాను. త్వరలో భాజపాయేతర పార్టీల నాయకులతో సమావేశమవుతాం. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటి మీదకు తీసుకురావడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం’’ అని నీతీశ్‌ కుమార్‌ అన్నారు. అయితే,ఈ ప్రయత్నాలు ఎంత మేర కార్యరూపం దాలుస్తాయన్నది ప్రశ్నార్థకమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని