CM Jagan: అందుకే రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారు.. సీఎం జగన్‌పై ప్రతిపక్షాల మండిపాటు

విశాఖే రాజధాని కాబోతోందంటూ.. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే జగన్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విమర్శించారు. 

Published : 31 Jan 2023 19:52 IST

విజయవాడ: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే సీఎం జగన్‌ రాజధానిపై మళ్లీ వివాదం రాజేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. విశాఖ రాజధాని కాబోతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమేనని విమర్శించాయి. అమరావతే రాజధాని అని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందన్న విపక్షాలు.. జగన్‌ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని చెప్పాయి.

కొద్ది రోజుల్లో విశాఖ రాజధాని కాబోతోందన్న సీఎం వ్యాఖ్యలపై తెదేపా మండిపడింది. సొంత బాబాయ్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడం, ఎంపీ అవినాశ్‌ రెడ్డిని విచారించడంతో.. సీఎంలో కలవరం మొదలైందని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అందుకే పథకం ప్రకారం ‘విశాఖ రాజధాని’ అని వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని అన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతోనే హడావుడిగా సీఎం జగన్‌ విశాఖ రాజధాని ప్రకటన చేశారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి.. సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడారన్న అంశం కీలకంగా మారిందన్నారు. ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.

మరోవైపు సీఎం వ్యాఖ్యలపై భాజపా నేత సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. 4 ఏళ్లలో సీఎం ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు. సీబీఐ విచారణ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్‌ రాజధానిపై వ్యాఖ్యాలు చేశారని అన్నారు. తన వ్యాఖ్యలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడంతోపాటు.. ఇప్పటికే అధోగతి పట్టిన రాష్ట్రాన్ని మరింత వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని