Congress President Poll: ‘థరూర్‌ దిగ్విజయ్’‌.. మనది ఫ్రెండ్లీ ఫైట్‌

అనేక మలుపులు.. నాటకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై ఓ మేరకు స్పష్టత వచ్చింది. రాజస్థాన్‌ సంక్షోభ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ

Published : 29 Sep 2022 16:28 IST

దిల్లీ: అనేక మలుపులు.. నాటకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై ఓ మేరకు స్పష్టత వచ్చింది. రాజస్థాన్‌ సంక్షోభ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ బరిలోకి దిగారు. అటు ఎంపీ శశిథరూర్‌ పోటీ ఇప్పటికే ఖాయమైంది. దీంతో ప్రస్తుతానికి హస్తం పార్టీ అధినాయకత్వ పదవికి వీరిద్దరి మధ్యే పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే థరూర్‌, దిగ్విజయ్‌ గురువారం సమావేశమయ్యారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను థరూర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘పార్టీ అధ్యక్ష ఎన్నికకు దిగ్విజయ్‌ పోటీని స్వాగతిస్తున్నా. మాది ప్రత్యర్థుల మధ్య జరిగే యుద్ధం కాదు. సహోద్యోగుల స్నేహపూర్వక పోటీ అని మేం పరస్పరం అంగీకరించాం. మాలో ఎవరు గెలుస్తారన్నది కాదు.. అంతిమంగా కాంగ్రెస్‌ గెలవాలన్నదే మా లక్ష్యం’’ అని థరూర్‌ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను దిగ్విజయ్‌ సింగ్‌ రీట్వీట్‌ చేస్తూ థరూర్‌ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ‘‘మా పోరాటం మతవాద శక్తులపైనే. గాంధీ-నెహ్రూ సిద్ధాంతాలపై మా ఇద్దరికీ విశ్వాసం ఉంది. థరూర్‌కు ఆల్‌ ది బెస్ట్’’ అని దిగ్విజయ్‌ తెలిపారు.

దిగ్విజయ్‌ గెలుపు ఖాయమేనా?

అధ్యక పదవికి నామినేషన్‌ సమర్పించేందుకు శుక్రవారమే (సెప్టెంబరు 30) ఆఖరి తేదీ. థరూర్‌, దిగ్విజయ్ రేపు నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటివరకైతే రేసులో ఇంకెవరి పేర్లూ వినిపించట్లేదు. దీంతో వీరిద్దరి మధ్యే పోటీ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో దిగ్విజయ్‌ గెలుపు ఖాయమే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ అయిన దిగ్విజయ్‌.. గాంధీ కుటుంబానికి విధేయుడు. పార్టీలోనూ ఆయనకు మద్దతు ఎక్కువగానే ఉంది. మరోవైపు కాంగ్రెస్‌ అధిష్ఠానం విధానాలను వ్యతిరేకిస్తూ లేఖ రాసిన జి-23 బృందంలో శశిథరూర్‌ ఒకరు. ఆయన పోటీపై అటు సొంత రాష్ట్రం కేరళ నుంచే గాక, పలువురు పార్టీ సీనియర్‌ నేతలు బహిరంగంగానే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది. అక్టోబరు 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబరు 19న ఓట్లను లెక్కించిన తరువాత ఫలితం ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు