Budget 2022: ఇదో మూర్ఖమైన, మొండి ప్రభుత్వం: చిదంబరం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగం పెట్టుబడిదారుల ప్రసంగం మాదిరిగానే ఉందని ఆరోపించారు.

Published : 02 Feb 2022 01:09 IST

కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేతల విమర్శలు

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం కూడా తాజా బడ్జెట్‌పై మండిపడ్డారు. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రసంగం పెట్టుబడిదారుల ప్రసంగం మాదిరిగానే ఉందని ఆరోపించారు. అంతేకాకుండా పెట్టుబడిదారుల ఆర్థికశాస్త్రం పరిభాషలో ఆర్థికమంత్రి ఎంతో ప్రావీణ్యం సంపాదించారంటూ విమర్శలు గుప్పించారు. ఇటువంటి బడ్జెట్‌ను ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని పి.చిదంబరం పేర్కొన్నారు.

‘గత రెండేళల్లో దేశంలో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా కరోనా సమయంలో దాదాపు 84 శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించడం లేదా పరోక్ష పన్నులను తగ్గించడంపై బడ్జెట్‌లో ఒక్కమాట కూడా లేదు. ఇక పేదలకు ఆర్థిక సహాయం చేయడంపైనా ఎటువంటి ప్రకటనా లేదు. స్థూల ఆర్థికవ్యవస్థ సూచీలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నతరహా పరిశ్రమలకిచ్చే సబ్సిడీల్లోనూ కోత స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి పెట్టుబడిదారీ బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరిస్తారు’ అని మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మూర్ఖంగా, మొండిగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

అంతకుముందు బడ్జెట్‌పై స్పందించిన రాహుల్‌ గాంధీ.. ఈ మోదీ ప్రభుత్వ బడ్జెట్‌ వల్ల ఏ వర్గానికీ ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ముఖ్యంగా వేతన జీవులు, మధ్యతరగతి, పేద, వెనుకబడిన, యువత, రైతులు, చిన్నతరహా పరిశ్రమలకు ఎలాంటి లాభం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా విమర్శలు గుప్పించారు. ఇది ధనికుల బడ్జెట్‌ మాత్రమేనని, ఇందులో పేదలకేమీ లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని