
Veerappa Moily: ఆజాద్‌కు పద్మభూషణ్.. మోదీ సర్కార్ రాజకీయ నిర్ణయమే!
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై ఆ పార్టీ నేత వీరప్ప మొయిలీ స్పందించారు. అది మోదీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయమే తప్ప మెరిట్ ఆధారంగా ఇచ్చింది కాదని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని ఆజాద్ భావిస్తే ఆ అవార్డును స్వీకరించొద్దని సూచించారు. నరేంద్ర మోదీ రాజకీయ నిర్ణయంలో భాగంగానే ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది తప్ప మెరిట్, ఇంకా మరే ఇతర కారణాల వల్లో కాదన్నారు. ఈ అవార్డును స్వీకరించాలో, వద్దో గులామ్ నబీ ఆజాదే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ అవార్డును స్వీకరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు నష్టమా? కాదా అనే అంశాలను బేరీజు వేసుకోవాలని ఆజాద్‌కు సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నాయకత్వ సమస్యను పరిష్కరించాలంటూ ఏడాదిన్నర క్రితం సోనియా గాంధీకి లేఖ రాసిన వారి(గ్రూప్-23)లో వీరప్ప మొయిలీ కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వం గులామ్ నబీ ఆజాద్‌కు మంగళవారం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత జీ-23 సభ్యులైన కపిల్‌సిబల్, ఆనంద్ శర్మ, శశిథరూర్ తదితరులు నిన్న అభినందనలు తెలపగా.. వీరప్ప మొయిలీ పైవిధంగా వ్యాఖ్యానించడం ఆ పార్టీలో ఈ ‘అవార్డు’తో స్పష్టమైన చీలిక కనిపించడం గమనార్హం.