Palaniswami: ‘అమ్మ’ పార్టీకి అధినాయకుడిగా.. పళని ఏకగ్రీవంగా ఎన్నిక
అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం పళనిస్వామి (Palaniswami) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ మరో మాజీ సీఎం పన్నీర్ సెల్వం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో పళని పార్టీ పగ్గాలు అందుకోవడానికి మార్గం సుగమమైంది.
చెన్నై: తమిళనాట (Tamilnadu) దశాబ్దాల చరిత కలిగిన అన్నాడీఎంకే (AIADMK) పార్టీ పగ్గాలను మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం ఒ. పన్నీర్ సెల్వం (O Panneerselvam) వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే.. పళని ఎన్నికపై అధికారిక ప్రకటన రావడం గమనార్హం.
అన్నాడీఎంకే (AIADMK)లో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేసి.. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి (EPS) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన కార్యదర్శి (General Secretary) పదవికి మార్చి 26న ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి పళని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అధినాయకత్వ పోరులో కోర్టుకెళ్లిన పన్నీర్ సెల్వం (OPS) పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసిన కొద్దిసేపటికే పార్టీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆధిపత్య పోరులో వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్న పన్నీర్ సెల్వం.. మరోసారి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి ఎన్నికను రద్దు చేయాలని పన్నీర్ మద్దతుదారులు పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పళని ఎన్నికకు మార్గం సుగమమైంది.
నాయకత్వ పోరు మొదలైందిలా..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (AIADMK) అధినేత్రి జయలలిత మరణించాక పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. నాటి నుంచి పన్నీర్ సెల్వం (O Panneerselvam) సమన్వయకర్తగా, పళనిస్వామి (E Palaniswami) సంయుక్త సమన్వయకర్తగా కొనసాగారు. అయితే, ద్వంద్వ నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారిందని.. పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంపై జిల్లా కార్యదర్శుల సమావేశం నిర్వహించి చర్చించారు. దానిలో పళని (EPS) వర్గం ఏకనాయకత్వ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఇందుకు పన్నీర్ (OPS) వర్గీయులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే 2022 జూన్ 23న సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత జులై 11న మరోసారి సమావేశం నిర్వహించారు. అందులో పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. కొత్తగా ఉప ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకొచ్చారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనిపై పన్నీర్ సెల్వం.. మద్రాసు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లభించలేదు. పళని ఎన్నికను న్యాయస్థానాలు సమర్థించాయి. కోర్టు తీర్పుల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించి.. పూర్తిస్థాయి అధినాయకుడిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం