Palla Srinivasa Rao: తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది.

Published : 17 Jun 2024 06:40 IST

నిబద్ధత, అంకితభావానికి దక్కిన గౌరవం
రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు
వైకాపా వేధింపులకు గురై.. తట్టుకుని నిలిచిన నాయకుడు

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. బీసీ వర్గానికి చెందిన ఆయన.. విద్యావంతుడు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖపట్నం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా నాలుగేళ్ల నుంచి వ్యవహరిస్తున్న ఆయన.. ఈ ఎన్నికల్లో గాజువాక స్థానం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కె.అచ్చెన్నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో.. కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. విశాఖ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా సమర్థవంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు పనిచేసిన అచ్చెన్నాయుడు అద్భుత పనితీరు కనబరిచారని.. సవాళ్లను ఎదుర్కొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారని ప్రశంసించారు. 

వైకాపా వేధింపులకు ఎదురొడ్డి నిలిచి

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాజువాక శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు ..  వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై 95,235 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2014-19 మధ్య శాసనసభ్యునిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కార్మిక నాయకుడిగా తెదేపా అనుబంధ విభాగం తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌(టీఎన్‌టీయూసీ) ఏర్పాటులోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక శ్రీనివాసరావు, ఆయన కుటుంబ సభ్యులను అయిదేళ్లపాటు తీవ్రంగా వేధించింది. పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారు. ఎంత ఒత్తిడి తెచ్చినా మాట వినకపోవడంతో.. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయన వాణిజ్య భవనాన్ని అక్రమంగా కూల్చివేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు భార్య లావణ్యదేవిని సైతం.. పాలకవర్గం ద్వారా వేధింపులకు గురి చేశారు. పదోన్నతి నిలిపేశారు. ఆమె ఎన్నికల్లో పాల్గొనకపోయినా.. ప్రచారం చేశారంటూ సస్పెండ్‌ చేశారు. వాటన్నింటిని ఎదుర్కొంటూ.. విశాఖ జిల్లాలో పార్టీ బలోపేతానికి శ్రీనివాసరావు కృషి చేశారు. అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఆయన అందించిన సేవలను గుర్తించిన అధిష్ఠానం.. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. 

చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ 

నా శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ‘కార్యకర్తల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తా. సమన్వయంతో ముందుకు వెళ్తా. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో మాట్లాడి.. కష్టపడి పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం లభించేలా కృషి చేస్తాను. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుంటూ.. వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతాం. అయిదేళ్ల వైకాపా పాలనలో రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూశారు. దాడులు, అరెస్టులతో అరాచకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తుంది. కక్ష సాధింపు చర్యలకు తావు లేదు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని