TDP: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు.

Published : 15 Jun 2024 06:22 IST

వైకాపా ఒత్తిళ్లకు తట్టుకొని నిలబడ్డ నేతగా గుర్తింపు

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. వైకాపా అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ను 95,235 ఓట్ల తేడాతో ఓడించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది రెండోసారి. ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఆయన తెదేపానే అంటిపెట్టుకుని ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడు, విద్యావంతుడు కావడం.. పార్టీపై ఆయన నిబద్ధత, అంకితభావానికి గుర్తింపుగా పల్లాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే యోచనలో తెదేపా అధినేత చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని భావించినా వివిధ సమీకరణాల వల్ల స్థానం కల్పించలేకపోయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ అవకాశం కల్పించే క్రమంలో పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది. గత ఐదేళ్లలో పల్లా కుటుంబాన్ని వైకాపా ప్రభుత్వం తీవ్రంగా వేధించింది. ఆయన ఆర్థిక మూలాల్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించింది. ఆస్తులకు నష్టం కలిగించింది. దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ఆయన వాణిజ్య భవనాన్ని అక్రమంగా కూలగొట్టింది. వైకాపాలో చేరాల్సిందిగా వివిధ సందర్భాల్లో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చింది. వాటన్నింటినీ ఎదుర్కొని పల్లా గట్టిగా నిలబడ్డారు. అవన్నీ దృష్టిలో ఉంచుకున్న పార్టీ అగ్రనాయకత్వం సముచిత ప్రాధాన్యమివ్వాలన్న యోచనలో ఉంది. పల్లా కుటుంబానికి తెదేపాతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1984 నుంచి పార్టీలో ఉన్నారు. 1994-99 మధ్య శాసనసభ్యుడిగా పనిచేశారు. పల్లా శ్రీనివాసరావు నాలుగేళ్లుగా పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగానూ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న   కె.అచ్చెన్నాయుడిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో పల్లాను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు