Pawan Kalyan: క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం రాత్రి భేటీ అయ్యారు. పవన్‌కల్యాణ్‌ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో పల్లా శ్రీనివాసరావు కలిశారు.

Published : 08 Jul 2024 03:17 IST

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ

పల్లాను భేటీకి ఆహ్వానిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి : ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శనివారం రాత్రి భేటీ అయ్యారు. పవన్‌కల్యాణ్‌ ఆహ్వానం మేరకు విజయవాడలోని ఆయన నివాసంలో పల్లా శ్రీనివాసరావు కలిశారు. సుమారు గంటన్నర పాటు వీరి మధ్య సమావేశం సాగింది. తెదేపా, జనసేన పార్టీల శ్రేణుల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం, ప్రజల ఆదరాభిమానాలు నిలబెట్టుకోవడానికి చేయాల్సిన పనులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని నేతలు చర్చించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు పార్టీల నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. జనసైనికులు చూపించిన రణోత్సాహం, తెదేపా శ్రేణుల సమష్టి కృషి, భాజపా అభిమానుల ఆదరణ మొత్తంగా ఓటర్ల తీర్పులో ప్రతిబింబించాయని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు సుదీర్ఘ పాలనానుభవం, పవన్‌కల్యాణ్‌ పోరాట పటిమ, ప్రధాని మోదీ నాయకత్వం మీద నమ్మకంతో ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంతటి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజా తీర్పునకు అనుగుణంగా దశాబ్దం పాటు ఈ మైత్రి కొనసాగాలి’’ అని పల్లా శ్రీనివాస్‌రావు అభిలషించారు. ఆ మేరకు కార్యాచరణను నేతలు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా భేదాభిప్రాయాలు తలెత్తుతున్నాయనే సూచనలు కనిపిస్తే.. తక్షణం వాటిని సరిదిద్దేలా మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ప్రజలు మరింత అవగతం చేసుకునేలా... సుపరిపాలన అందించాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.


ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు

- పార్టీ శ్రేణులకు పవన్‌ హితవు

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, అధికారుల పనితీరును బలహీనపరిచేలా నిరాధార ఆరోపణలు చేసినా కఠిన చర్యలుంటాయని తమ పార్టీ శ్రేణులను జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి క్షీణదశకు చేరి, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైన దశలో ఎన్డీయే ప్రభుత్వం పరిపాలనా బాధ్యతలు చేపట్టిందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి పార్టీ కార్యకర్తలంతా వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించడమే. అలాంటి వారిపై చర్యలు తప్పవు. షోకాజ్‌ నోటీసులు ఇస్తాం. సంతృప్తికర సమాధానాలు లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించినట్లు పార్టీ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని