Palla Srinivasa Rao: సొంత బాబాయ్‌ చనిపోయినా.. జగన్‌ ఇంతలా స్పందించలేదు

తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్‌.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Updated : 06 Jul 2024 05:45 IST

పిన్నెల్లితో ములాఖత్‌కు హెలికాప్టర్‌లో వెళ్తారా?
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు 

ఈనాడు డిజిటల్, అమరావతి: తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి చనిపోతే పట్టించుకోని జగన్‌.. ఈవీఎం పగలగొట్టి, సీఐ హత్యకు యత్నించి జైలుపాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టి హెలికాప్టర్‌లో వెళ్లడం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ములాఖత్‌ సందర్భంగా నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఈవీఎం పగలగొట్టిన వ్యక్తిని జగన్‌ వెనకేసుకురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శ్రీనివాసరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా మోసపూరిత హామీలతో గెలిచిందంటూ జగన్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. గత ఐదేళ్లుగా ప్రజలను మోసం చేసింది ఆయనే. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు. జాబ్‌ క్యాలెండర్‌ అని నిరుద్యోగుల్ని వంచించారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టకొట్టారు’ అని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇకనైనా జగన్‌ అసత్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

పిన్నెల్లి వెంకటరామిరెడ్డినీ అరెస్టు చేయాలి: వర్ల

ఎన్నికల సందర్భంగా మాచర్లలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఏ2గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డిని కూడా అరెస్టు చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. 

సుమోటోగా జగన్‌పై కేసు నమోదు చేయాలి: మంత్రి రామానాయుడు  

వైకాపా అధినేత జగన్‌పై ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. ఈవీఎంలు పగలగొట్టిన కేసులో జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పిన్నెల్లిని జగన్‌ కలవడం ఆయనకు మద్దతిచ్చినట్లు అవుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎమ్మెల్యే జగన్‌పై చర్యలు తీసుకోవాలని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. 

సమయం ముగిసినా జగన్‌కు ములాఖత్‌: మంత్రి వాసంశెట్టి సుభాష్‌ 

కొందరు అధికారుల తీరులో వైకాపా వాసనలు ఇంకా పోలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సమయం ముగిసినా, నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు జగన్‌కు ములాఖత్‌ అవకాశం కల్పించారని అధికారులపై మండిపడ్డారు. పల్నాడు ఫ్యాక్షనిస్టు పిన్నెల్లి ఓటర్ల సమక్షంలోనే ఈవీఎంను ధ్వంసం చేస్తే.. దాన్ని సమర్థించడం ద్వారా జగన్‌ నైజం ఏంటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని