Ljp: ఆయన్ను కేంద్రమంత్రిని చేస్తే..కోర్టుకు వెళ్తాం

ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలపై ఆ పార్టీ నేత చిరాగ్ పాసవాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 07 Jul 2021 05:34 IST

చిరాగ్ పాసవాన్ ఆగ్రహం

దిల్లీ: ఎల్జేపీ చీలిక వర్గం నేత పశుపతి పరాస్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే వార్తలపై ఆ పార్టీ నేత చిరాగ్ పాసవాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరాస్‌ ఎల్జేపీలో భాగం కానందున.. పార్టీ కోటా కింద ఆయన కేంద్రమంత్రిగా నియమితులు కాలేరని చిరాగ్ వ్యాఖ్యానించారు. ‘మా పార్టీతో ప్రమేయం లేకుండా ఆయన్ను స్వతంత్రంగా మంత్రిని చేసుకోవచ్చు. ఎల్జేపీ కోటా కింద మంత్రిని చేస్తే..దాన్ని మేం కచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఆ నియామకంపై కోర్టుకు వెళ్తాం’ అని చిరాగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. 

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీన ముహూర్తం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో భాగం కానున్నారని భావిస్తున్న పలువురు నేతలు ఇప్పటికే దిల్లీకి పయమనమయ్యారు. ఈ క్రమంలోనే చిరాగ్ స్పందన వెలువడింది. దళిత నేత, దివంగత రామ్ విలాస్ పాసవాన్ నెలకొల్పిన ఎల్జేపీలో కొద్ది వారాల కిందట తిరుగుబాటు జెండా ఎగిరిన సంగతి తెలిసిందే. పాసవాన్ తమ్ముడు పశుపతి ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించి, పార్టీని చీల్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని