Paresh Rawal: వివాదాస్పదమైన ‘చేపల కూర’ కామెంట్‌.. సారీ చెప్పిన పరేశ్‌ రావల్‌!

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ పరేశ్‌ రావల్‌ వివాదంలో చిక్కుకున్నారు. నటుడి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చివరికి పరేశ్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

Published : 03 Dec 2022 01:12 IST

అహ్మదాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, భాజపా ఎంపీ పరేశ్‌ రావల్‌ వివాదంలో చిక్కుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటుడి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చివరికి పరేశ్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గుజరాత్‌ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పరేశ్‌ రావల్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. ‘‘గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. కొన్ని రోజులకు వాటి ధరలు దిగి వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలూ వస్తాయి. కానీ, దిల్లీ తరహాలో రొహింగ్యాలు, బంగ్లాదేశీలు మీ చుట్టూ చేరితే.. గ్యాస్‌ సిలిండర్లతో మీరేం చేసుకుంటారు? బెంగాలీలకు మీరు చేపలు వండి పెడతారా?’’ అంటూ ప్రశ్నించారు. ధరల పెరుగుదలనైనా గుజరాతీలు భరించగలరు గానీ, అలాంటివి ఏమాత్రం సహించలేరంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. ప్రైవేటు విమానంలో వచ్చి ఇక్కడ రిక్షాల్లో తిరుగుతూ కొందరు షో చేస్తుంటారంటూ కేజ్రీవాల్‌ను విమర్శించారు.

పరేశ్‌ రావల్‌పై  పోలీసులకు సీపీఎం ఫిర్యాదు 

అయితే, పరేశ్‌ రావల్‌ వ్యాఖ్యలు బెంగాలీలను అవమానించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బెంగాల్‌లో ఆయన సినిమాలు బ్యాన్‌ చేయాలనేంత వరకూ వెళ్లాయి. బీఎస్‌ఎఫ్‌, హోంమంత్రిత్వ శాఖ సరిగా పనిచేయకపోవడం వల్లే బంగ్లాదేశీయులు, రొహింగ్యాలు దేశంలో ప్రవేశిస్తున్నారని పరేశ్‌ చెప్పాలనుకుంటున్నారా అంటూ తృణమూల్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ విమర్శించారు. పరేశ్ రావల్‌ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సీపీఎం ఆగ్రహం వ్యక్తంచేసింది. బెంగాలీల గురించి వ్యాఖ్యానించిన ఆయనపై కోల్‌కతాలోని తారాటోలా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత మహమ్మద్‌ సలీం మాట్లాడుతూ.. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పరేశ్‌ చేసిన వ్యాఖ్యలు అల్లర్లకు ప్రేరేపించడంతో పాటు దేశవ్యాప్తంగా బెంగాలీలు, ఇతర వర్గాల మధ్య సామరస్యతను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పరేశ్‌ స్పందించారు. ఇక్కడ బెంగాలీ అంటే తన ఉద్దేశం బంగ్లాదేశ్‌, రొహింగ్యాలు అని అర్థం అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు