Rahul Gandhi: మోదీపై ఆరోపణలు.. రాహుల్‌ గాంధీపై చర్యలకు భాజపా డిమాండ్‌..!

ప్రధాని మోదీపై రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భాజపా మండిపడుతోంది. మోదీపై (Narendra Modi) నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు లోక్‌సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్‌ చేసింది.

Updated : 08 Feb 2023 16:29 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై భాజపా మండిపడింది. ఆ అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరింది. మంగళవారం జరిగిన ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. బుధవారం సభ మొదలు కాగానే రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రితో పాటు భాజపా ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

‘కాంగ్రెస్‌ నేత కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత అభ్యంతరకర, నిరాధార ఆరోపణలు. వాటిని తొలగించడంతోపాటు ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్‌ చేశారు. దీనిపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

మరోవైపు మోదీపై నిరాధార ఆరోపణలు చేయడంతోపాటు సభను తప్పుదోవ పట్టించినందుకు రాహుల్‌ గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా ఎంపీ నిశికాంత్‌ దుబే స్పీకర్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. సభా గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని అందులో పేర్కొన్నారు. అయితే, భాజపా నేతలు, మంత్రి చేసిన డిమాండ్లపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తక్షణం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిని పరిశీలిస్తానని.. అనంతరం నిర్ణయిం తీసుకుంటానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని