EC: ఎన్నికల హమీలను ఎలా నెరవేరుస్తారు..? మీకున్న వనరులేంటి..?

ఎన్నికల హామీల వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది..? ఆర్థిక వనరుల లభ్యత, వాటి వల్ల సంబంధిత ప్రభుత్వాలపై పడే ఆర్థిక భారం గురించి పార్టీలు సమాచారం ఇవ్వాలని ఎన్నికల సంఘం కోరింది.

Published : 04 Oct 2022 21:59 IST

దిల్లీ: ఎన్నికల్లో ఉచితవరాల జల్లులు కురిపించే పార్టీలకున్న ఆర్థిక వనరుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజలకు ఇచ్చిన హామీలపై మరింత జవాబుదారీగా ఉండేందుకు పార్టీలు తగిన సూచనలు చేయాలని కోరింది. ఈ మేరకు తాజాగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది.

‘అమలుకు సాధ్యమయ్యే  వాగ్దానాల ద్వారానే ఓట్లు అడగాలి. నెరవేర్చడానికి వీలుకాని హామీలు పెను ప్రభావాన్ని చూపుతాయి. మేనిఫెస్టోలను రూపొందించడం రాజకీయ పార్టీల హక్కు అనే విషయాన్ని అంగీకరిస్తున్నప్పటికీ.. ఉచితాల వల్ల కలిగే అవాంఛనీయ ప్రభావాన్ని మాత్రం ఎన్నికల సంఘం విస్మరించదు. ఎన్నికల నియమావళి ప్రకారం.. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వారి ఎన్నికల హామీలను సమర్థించుకోవడంతో పాటు వాటికి వనరులు ఎలా సమకూరుస్తారో వివరించాల్సి ఉంటుంది. అయితే ఆ సందర్భంగా చేసే ప్రకటనలన్నీ చాలా రొటీన్‌గా, గందరగోళంగా ఉండటమే కాకుండా.. సరైన అభ్యర్థిని ఎంచుకునే విధంగా అవి ఓటర్లకు తగిన సమాచారాన్ని ఇవ్వవు’ అని ఆ లేఖలో పేర్కొంది. 

అలాగే ఆ హామీల వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది..? ఆర్థిక వనరుల లభ్యత, వాటి వల్ల సంబంధిత ప్రభుత్వాలపై పడే ఆర్థిక భారం గురించి కూడా పార్టీలు సమాచారం ఇవ్వాలని సూచించింది. దీనిపై అక్టోబర్ 19లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని