ఖర్గే Vs థరూర్‌: ఆఫీస్‌ బేరర్లు ఎన్నికల ప్రచారం చేయొద్దు.. కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ హైకమాండ్‌ కీలక మార్గదర్శకాలు రూపొందించింది. పార్టీ ఆఫీస్‌బేరర్లు ఎవరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ప్రచారం చేయదలచుకుంటే.......

Published : 04 Oct 2022 01:09 IST

పార్టీ అధ్యక్ష పోరుకు కాంగ్రెస్‌ మార్గదర్శకాలివే..

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ఆ పార్టీ హైకమాండ్‌ కీలక మార్గదర్శకాలు రూపొందించింది. పార్టీ ఆఫీస్‌బేరర్లు ఎవరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని తేల్చి చెప్పింది. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ప్రచారం చేయదలచుకుంటే తొలుత పార్టీ పదవులకు రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.  అక్టోబర్‌ 17న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా.. 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని అదేరోజు వెల్లడించనున్న విషయం తెలిసిందే.

మార్గదర్శకాలివే..

  • మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌ తమ వ్యక్తిగత హోదాల్లోనే కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఎవరికి ఓటు వేయాలనేది ప్రతినిధుల ఇష్టమే. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా వారిద్దరిలో ఎవరికైనా ఓటు వేసి ఎన్నుకొనే స్వేచ్ఛ ఉంటుంది.
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు/ఇన్‌ఛార్జిలు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, అధికార ప్రతినిధులు, పార్టీలోని వివిధ విభాగాల అధిపతులు ఎవరూ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొనరాదు. 
  • ఒకవేళ అభ్యర్థులకు మద్దతుగా ఎవరైనా ప్రచారం చేయాలనుకుంటే ముందే పార్టీ పదవులకు రాజీనామా చేయాలి. ఆ తర్వాత ప్రచార ప్రక్రియలో భాగస్వాములు కావొచ్చు.
  • బరిలో ఉన్న అభ్యర్థులు ఆయా రాష్ట్రాలకు ప్రచారం కోసం వస్తే పీసీసీ అధ్యక్షులు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. పీసీసీ అధ్యక్షుడు తమ రాష్ట్రంలో మీటింగ్‌ హాలు, కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేయాలి  తప్ప అభ్యర్థి గెలుపు కోసం తన వ్యక్తిగత సామర్థ్యాన్ని ఉపయోగించరాదు.
  • ఎన్నిక సమయంలో ఏ అభ్యర్థీ ఓటర్లను తరలించేందుకు వాహనాలు వాడరాదు. కరపత్రాలు, ఇతర ప్రచురణలు చేయరాదు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ రూపొందించిన ఈ విధానాలను వివాదాస్పదం చేస్తే ఎన్నిక చెల్లుబాటు కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. క్రమశిక్షణా చర్యలకు బాధ్యులవుతారు. 
  • ఏ అభ్యర్థి పట్ల దుష్ప్రచారం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి చర్యలతో పార్టీ ప్రతిష్ఠకు నష్టం జరుగుతుందని గుర్తించాలి. 

మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను శశిథరూర్‌ స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రొఫెషనల్స్‌ విభాగానికి చీఫ్‌ పదవికి తాను గత నెలలోనే రాజీనామా చేశానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని