Pawan Kalyan: ఎన్నికల సమరానికి సై.. పవన్‌ ప్రచార వాహనం సిద్ధం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ గ్యారేజీలో ప్రచార వాహనానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు.

Published : 08 Dec 2022 01:40 IST

హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రచార వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఓ గ్యారేజీలో ప్రచార వాహనానికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. సిద్ధమైన వాహనాన్ని, ట్రయల్‌ రన్‌ను పవన్‌ కల్యాణ్ ఇవాళ హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కి కొన్ని ముఖ్య సూచనలను చేశారు. వాహనాన్ని తీర్చి దిద్దిన సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు. ప్రచార వాహనానికి సంబంధించి వీడియో, ఫోటోలను పవన్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ వాహనానికి ‘వారాహి’ పేరు పెట్టినట్టు పవన్‌ పేర్కొన్నారు. ‘వారాహి’... రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అని ప్రకటించారు. దసరా తర్వాత పవన్‌ పర్యటన ఉంటుందని మొదట్లో ప్రకటించినా.. అది 2023కు వాయిదా పడింది. వచ్చే ఏడాది మొదట్లో పర్యటన ఉండే అవకాశముందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

‘వారాహి’ అంటే? 

దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు ‘వారాహి’. అందుకే ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.

‘వారాహి’ విశేషాలివే..

‘వారాహి’ వాహనాన్ని ప్రత్యేక భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.‘‘ పవన్‌ పర్యటనల సందర్భంగా  విద్యుద్దీపాలు ఆర్పివేసి కక్ష సాధింపు చర్యలకు దిగే సంస్కృతిని చూస్తున్నాం. ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా వీధి దీపాలు ఆర్పివేసిన విషయం తెలిసిందే. ‘వారాహి’ వాహనంపై ప్రత్యేక లైటింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. వాహనం నుంచి పవన్‌ ప్రసంగించే సందర్భంలో లైటింగ్‌ కోసం ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. ఆధునిక సౌండ్‌ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్‌ప్రసంగం వినిపించేలా సౌండ్‌ సిస్టం ఉంటుంది. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్‌కి రియల్‌ టైమ్‌లో వెళ్తుంది. వాహనం లోపల పవన్‌ కల్యాణ్తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి హైడ్రాలిక్‌ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరుకోవచ్చు. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్‌ పర్యటనల్లో ఎదురైన అంశాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్‌ నిర్ణయించారు’’ అని జనసేన వర్గాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని