పాక్‌ పాటి చర్యలనూ జగన్‌ ప్రభుత్వం తీసుకోలేదా?

ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడి విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర సాగుతోందని జనసేన అధినేతన పవన్‌ కల్యాణ్‌....

Published : 03 Jan 2021 01:54 IST

విగ్రహాల ధ్వంసంపై పవన్‌ విమర్శలు

అమరావతి: ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడి విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర సాగుతోందని జనసేన అధినేతన పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాజాగా కర్నూలు జిల్లా మర్లబండలో ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న సీతారామచంద్రుల విగ్రహాలను పగలగొట్టడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఏడాదిన్నరగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు, విగ్రహాలకు అపవిత్రత జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనుకుండా ఉండడం వల్లే మతోన్మాదులు మరింత తెగబడుతున్నారని పవన్‌ దుయ్యబట్టారు.

పొరుగున ఉన్న శత్రుదేశం పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే అక్కడి ప్రభుత్వం 45 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకకుండా ఆ ఆలయాన్ని పునర్‌నిర్మించే బాధ్యత తీసుకుందని పవన్‌ కల్యాణ్‌ గుర్తుచేశారు. శత్రుదేశం పాటి చర్యలను కూడా జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదా? అని ప్రశ్నిచారు. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో 8 విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి రామతీర్థం, రాజమహేంద్రవరం, తాజాగా మర్లబండ వరకు విగ్రహాలను పగలగొడుతున్నా.. రథాలను తగలబెడుతున్నా ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని విమర్శించారు. దేవుడిపై నిర్లిప్త ధోరణి ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిని మరింత ప్రోత్సహించేలా ఉందన్నారు. ఈ వైఖరి మరిన్ని దేవాలయాల విధ్వంసానికి దారితీసే ప్రమాదముమందని హెచ్చరించారు. హిందూ ధర్మంపై సాగుతున్న ఈ దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకుని కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్‌ చేశారు. పాలకపక్షం సైతం ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి పక్కదోవ పట్టించుకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. హిందూ ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించి వాటి పునరుద్ధరణ బాధ్యతలను తీసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి..
రామతీర్థం రణరంగం
రామతీర్థంలో ఆయనకేం పని?: చంద్రబాబు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని