Pawan Kalyan: ఇలాగైతే ఆ రైల్వే లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి?: పవన్‌

అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఏపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు.

Published : 10 Feb 2022 13:17 IST

అమరావతి: అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఏపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రైల్వే మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరిగిందో తెలుస్తోందని.. వైకాపా ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పవన్‌ పోస్ట్‌ చేశారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పూర్తికావాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వ అలసత్వంతోనే జాప్యం అవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదలకు చేయకపోతే పనులు ఎలా సాగుతాయని పవన్‌ ప్రశ్నించారు.

‘‘కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే. ఈ ప్రాజెక్టుకు 25శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో పనులు ముందుకెళ్లడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయి. ఈ రైల్వే లైన్‌ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1,351కోట్లు, కడప-బెంగళూరు లైన్‌కు రూ.289కోట్లు, రాయదుర్గం- తుమకూరు లైన్‌కు రూ.34కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలి. నిధులు ఇవ్వరు.. భూసేకరణ కూడా చేయరు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? మౌలిక వసతుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఇలాగైతే ఆయా లైన్లు ఎప్పటికి పూర్తవుతాయి?’’ అని ఆయన నిలదీశారు.

రాష్ట్రంలో రైల్వే లైన్ల పూర్తికి ఆ శాఖ మంత్రి చెప్పిన సమాధానంలోని అంశాలను సీఎంకు వివరించి రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయించాల్సిన బాధ్యత వైకాపా ఎంపీలపై ఉందని పవన్‌ అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటన పూర్తయినా అది కార్యరూపం దాల్చేలా చేయడంలో ఎంపీలు విఫలమవుతున్నారని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయించలేరు.. ప్రకటించిన జోన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని పవన్‌ విమర్శించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని