
Pawan kalyan: ఆ నిర్ణయం ప్రభుత్వ అనాలోచిత వైఖరికి నిదర్శనం: పవన్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య ఆందోళన కరంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకు సేవలందించే ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది అధిక సంఖ్యలో కొవిడ్ బారిన పడుతుండటం విచారకరమన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కొవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పరీక్షలు, పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచాలని సూచించారు. మొబైల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. కరోనా మొదటి వేవ్‌లో పాటించిన ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ఏపీలో రాత్రి కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధం ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు సరికాదన్నారు. కొవిడ్ ఉద్ధృతి తగ్గే వరకు తరగతులు వాయిదా వేయాలని కోరారు. పిల్లలకు వ్యాక్సినేషన్ పూర్తికాకపోవటం, వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని వైకాపా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలను మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని వెల్లడిస్తోందని విమర్శించారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రకటించాలి కానీ, మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటని నిలదీశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం చేయాలని విజ్ఞప్తి చేశారు.