Pawan Kalyan: ఆడబిడ్డలపై దురాగతాలు.. ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా?: పవన్‌

ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

Updated : 27 Sep 2023 18:15 IST

అమరావతి: ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాలపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్‌ విద్యార్థిని హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించకపోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీలో ఆడబిడ్డల అదృశ్యంపై మాట్లాడితే హాహాకారాలు చేసిన మహిళా కమిషన్ ఇప్పుడు ఏం చేస్తోందో చెప్పాలన్నారు. భారీగా నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. హత్యకు గురైన బాలిక తల్లితండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

కేసు తీవ్రతను తగ్గించేందుకు అనుమానాస్పద మృతి అంటూ పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కూడా కలచి వేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు. మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించకుండా పోలీసుల చేతులను కూడా పాలకపక్షం కట్టేస్తోందని విమర్శించారు. దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాం అనే ప్రకటనలు మహిళలకు ఏమాత్రం రక్షణ ఇవ్వడం లేదని పవన్‌ మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని