Pawan Kalyan: చమురు ధరలపై కేంద్రం నిర్ణయం హర్షణీయం: పవన్‌ కల్యాణ్‌

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

Published : 22 May 2022 17:10 IST

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కేంద్రం మార్గాన్ని రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరించాలని ఆయన సూచించారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

రోజురోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందన్నారు. పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 వరకు తగ్గడం హర్షణీయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంతవరకు తగ్గే అవకాశముండటంతో అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కలుగుతుందన్నారు. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇవ్వడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుందని పవన్‌ అభిప్రాయపడ్డారు.

చమురు ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిస్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని